జనం పవర్, హైదరాబాద్:
తమ దేశం నుంచి చమురు కొనుగోలు అంశంలో భారత్‌పై అమెరికా వైఖరి అన్యాయమని రష్యా ఆరోపించింది. ఈ మేరకు ఆ దేశ దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ వ్యాఖ్యానించారు.
భారత్–రష్యా మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందని, అయినప్పటికీ భారత్‌తో ఉన్న సంబంధాలపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శిస్తూ, వాస్తవానికి మిత్రదేశాలు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వాషింగ్టన్‌ను దెప్పిపొడిచారు.
భవిష్యత్తులో భారత్‌పై అలాంటి చర్యలు రష్యా తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం సగటున 5 శాతం డిస్కౌంట్‌తో భారత్ అవసరాల్లో దాదాపు 40 శాతం చమురును రష్యా సరఫరా చేస్తోందని వివరించారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతులు చేయడంలో భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, రష్యా మార్కెట్లు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతాయని తెలిపారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో అండగా నిలవటానికి తమ దేశం కట్టుబడి ఉందని బబుష్కిన్ హామీ ఇచ్చారు.
అలాగే, చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లపై భారత్–రష్యా చర్చలు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. భారత్‌లో ఉత్పత్తులు చేయడానికి న్యూఢిల్లీకి సరైన భాగస్వామి రష్యానేనని పేర్కొన్నారు. గతంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో సహకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం శక్తివంతమైన జెట్ ఇంజిన్ల తయారీపై కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
భారత్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని, అందుకే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపారని వివరించారు. సమస్యల పరిష్కారంపై బీజింగ్–న్యూఢిల్లీ కలిసి పనిచేయడాన్ని రష్యా స్వాగతిస్తోందని, ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటన విజయవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు.









