జనం పవర్ – గంగాధర, ఆగస్టు 20:
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–కామారెడ్డి జిల్లా సరిహద్దులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగాధర మండలానికి చెందిన పెగుడ మల్లవ్వ (64)ను ముగ్గురు దుండగులు హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. గత శనివారం ఆమెను కారులో అపహరించి అదే రోజు హత్య చేసినట్లు సమాచారం. భర్త మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తున్న మల్లవ్వకు, ఇచ్చిన రూ.2 లక్షల అప్పు తిరిగి ఇస్తామని నమ్మబలికి కారులో తీసుకెళ్లారు. తమ కారు నంబర్ సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా నల్ల రేడియం అంటించి జాగ్రత్తలు తీసుకున్నారు. మరుసటి రోజు మల్లవ్వ సోదరుడు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు వృద్ధురాలు హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దుండగులు అపహరించినట్టు తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గంగాధర ఎస్సై వంశీకృష్ణ వెల్లడించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వారిని గంభీరావుపేటకు తరలించారని, ప్రాథమిక విచారణలో నగల కోసం హత్య చేసినట్టు తేలిందని, పూర్తి వివరాలు సాయంత్రానికి బయటపడే అవకాశముంది.









