జనం పవర్, రామగుండం ఆగస్టు 16:
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో యూరియా కొరత సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం సందర్శించిన ఎమ్మెల్యే, అమోనియా ప్లాంట్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని, నాసిరకం పైపులైన్ వాడకంతో అమోనియా లీకేజీలు సంభవిస్తున్నాయని,దీంతో రామగుండం ప్రజలు అణుబాంబుల క్రింద జీవిస్తున్న పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు షట్డౌన్ చేసి యూరియా ఉత్పత్తికి ఆటంకం కలిగించారని విమర్శించారు. రైతులు నాట్లు వేసి యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతుండగా,తెలంగాణకు కేటాయించాల్సిన 50 శాతం యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని మండిపడ్డారు. వీర్లపల్లి గ్రామాన్ని తరలించాలనే తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తూ,రసాయనాల శాఖమంత్రిని కలిసి సమస్యలపై విన్నవిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా కర్మాగారం సీఈఓ అలోక్ సింఘాల్ కు వినతిపత్రం అందజేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.









