జనంపవర్, భీమదేవరపల్లి ఆగస్ట్ 16:
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆధార్ కార్డుల నమోదు కోసం ఎదురు చూస్తున్నారు. ఆధార్ నమోదు, అప్ డేట్ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా ప్రభుత్వం ఉచితంగా బడుల్లోనే నిర్వహిస్తోంది. ఏటా ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తుండగా ఈసారి మాత్రం ఇంకా ఏర్పాటు కాలేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల వివరాలు యూ డైస్ రికార్డుల లోకి చేర్చడం లేదు. ప్రభుత్వ బడుల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే బడులకు ప్రభుత్వం నిధుల కేటాయింపులు, ఉపాధ్యాయుల నియామకం, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను సమాకురుస్తుంది. జాతీయ ఉపకార వేతనాలకు కూడా ఆధార్ తప్పనిసరి. కేంద్రం ఇటీవల జారీ చేస్తున్న అపార్ కు కూడా ఆధార్ అవసరమే. ఇందుకు జిల్లాలో గత ఏడాది దాదాపు 20 మందిని నియమించినా.. వారికి సమీపంలోని పాఠశాలల విద్యార్థులకే ఈ సేవలు అందించడంతో పూర్తి స్థాయిలో ఆధార్ నమోదు, నవీకరణ జరగలేదు. జిల్లా విద్యా శాఖ లెక్కల ప్రకారం హనుమకొండ జిల్లాలో 3వేల మంది బాలలకు ఆధార్ కార్డులు లేనట్లుగా గుర్తించారు. వీరిలో ప్రాథమిక తరగతులు చదువుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. గతంలో ఎమ్మార్సీ కార్యాలయాల్లో, ప్రతీ మండలంలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పరికరాలను వెనక్కి తీసుకుంది. గత ఏడాది ప్రైవేట్ వ్యక్తులకు దీనిని అప్పగించారు. మండలానికి ఒక్కరు, అవసరమైన చోట ఇద్దరు చొప్పున నియమించారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆధార్ నమోదు, నవీకరణకు హనుమకొండ జిల్లాలో 11 మందికి రాష్ట్ర విద్యా శాఖ అనుమతులు ఇచ్చింది. కానీ జిల్లా విద్యా శాఖ వద్ద ఆ వివరాలు రాకపోవడంతో నమోదు ప్రక్రియ చేపట్టడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేలకు పైగా బాలలు కొత్తగా ప్రవేశాలు పొందినా దాదాపు 2 వేలమందికి ఆధార్ కార్డులు లేకపోవడంతో యూ డైస్ లో వారి నమోదు కనిపించడం లేదు. బడుల్లోని విద్యార్థుల సంఖ్యకు యూ డైస్ లోని విద్యార్థుల సంఖ్యకు పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. హనుమకొండ జిల్లాకు వేరే ప్రాంతాల నుండి వలస వచ్చిన బాలలకే ఎక్కువగా ఆధార్ కార్డులు ఉండటం లేదు. ప్రభుత్వం నియమించిన ప్రైవేట్ వ్యక్తులు బయోమెట్రిక్ ద్వారా పనులు చేపడితే సమస్య తీరే అవకాశం ఉందని హనుమకొండ జిల్లాలోని ఉపాధ్యాయులు చెబుతున్నారు.









