అక్రమ గ్యాస్ రీఫిలింగ్‌పై పోలీసుల దాడి
జనం పవర్,రామగుండం ఆగస్టు 11:
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ ఆదేశాలపై, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి లక్ష్మీనగర్‌లోని గ్యాస్ స్టవ్, సిలిండర్ రిపేర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు, పైపులు, ఎలక్ట్రిక్ మోటార్లతో వాహనాలకు గ్యాస్ రీఫిలింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టగా, ఇది చట్టవిరుద్ధమని, ప్రమాదకరమని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ మంటలు చెలరేగిన ఘటనను ప్రస్తావిస్తూ, సమయానికి స్పందించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు. నివాస, రద్దీ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల నిల్వ నిషేధమని, గోదాముల్లోనే ఉంచాలని సూచించారు. రీఫిలింగ్ చేసిన వారితో పాటు, వారికి సిలిండర్లు విక్రయించిన వారినీ నేరస్తులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రజా భద్రత కోసం ముందస్తు చర్యలలో భాగంగా యజమానులు, సిబ్బందిని బైండోవర్ చేశారు.











