జనం పవర్,పెద్దపల్లి ఆగస్టు 11:
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్, ముందుగా పెద్దపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రామన్ కలెక్టరేట్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరగా, మున్సిపల్ కమిషనర్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఆవునూరి పద్మ నివాసం శిథిలావస్థలో ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై పీడీ హౌసింగ్‌కు విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం, పాలకుర్తి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు సర్వే నెంబర్ 503లో ప్రభుత్వ భూమిపై పంపు కట్టిన విషయంపై ఫిర్యాదు చేయగా, పెద్దపల్లి ఆర్డీవోను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.









