జనంపవర్, భీమదేవరపల్లి ఆగస్టు 9:
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రస్తుతం మత్స్య కారులకు కలగానే మిగులుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. గత భారాసా ప్రభుత్వం ఎంత్స్య కార్మికుల అభ్యున్నతికి ఏటా ఉచితంగా చేపలు, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టింది. వాటిని మత్స్య కారులు చెరువుల్లో పెంచి ఉపాధి పొందేవారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే చేప పిల్లల విత్తనాల కోసం టెండర్లు పిలవాల్సి ఉన్నా నేటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. గత ఏడాది జూన్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించారు. అప్పుడు కూడా కొంత ఆలస్యంగానే పంపిణీ జరిగింది. హనుమకొండ జిల్లాలో 50 శాతం మాత్రమే సరఫరా చేశారు. మూడు, నాలుగేళ్ళ కిందటివరకు ఏప్రిల్ చివరి వారంలో ప్రకటన విడుదల చేసి మే నెలలో టెండర్లు ఖరారు చేసారు. వర్షాలు కురుస్తున్న సమయంలో జూన్ నుండి ఆగస్టు లోగా చేప పిల్లలను పంపిణీ చేసేవారు. అలాంటిది ఈ ఏడాదిలో ఆగస్టు ప్రారంభమైనా ఇంకా టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. వాస్తవంగా చెరువుల్లో రెండు రకాల సైజుల్లో చేప పిల్లలు వదులుతారు. పూర్తిగా నీటితో నిండిన చెరువుల్లో 45 రోజుల వయసున్న 35-40 మి. మీ. పొడవున్న వాటిని అలాగే ఏడాది మొత్తం నీటి నిల్వ ఉండే పెద్ద చెరువుల్లో, జలాషయాల్లో 75 రోజుల వయసున్న 80-100 మి. మీ. పొడవున్న వాటిని వదులుతారు. నీటిలో వదిలిన తరువాత కిలో పెరగాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది. జూన్ జూలై నెలల్లో వదిలితే డిసెంబర్ నుంచి రెండు మూడు నెలల పాటు విక్రయించుకొనే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. లేటుగా సెప్టెంబర్ నెలలో వదిలితే కిలో పెరగాలంటే వేసవి వస్తుంది. అప్పుడు ఎండల వేడిమికి చేపలు చనిపోతాయి అని మత్స్య కారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేపపిల్లల పంపిణీ చేపట్టాలని వారు కోరుతున్నారు.









