ఆర్సీపురంలో హంపీ షాపింగ్ మాల్ ప్రారంభం-భారీగా మహిళల రద్దీతో స్వల్ప ఉద్రిక్తతలు

 

 

ఆర్సీపురం:

పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన హంపీ వస్త్ర షాపింగ్ మాల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సినీ నటులు రీతూ వర్మా, నేహా శెట్టి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఓపెనింగ్ ఆఫర్‌కు పోటెత్తిన మహిళలు

మాల్ యాజమాన్యం ఓపెనింగ్ ఆఫర్ కింద 39 రూపాయలకే చీరలు అందిస్తున్నట్టు ముందస్తుగా ప్రచారం జరిపింది. శ్రావణ మాసం,వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి లాంటి పండుగలు సమీపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు మాల్‌కు తరలివచ్చారు.
ఒక్కసారిగా పెరిగిన రద్దీకి మాల్ సిబ్బంది తట్టుకోలేక తాత్కాలికంగా మాల్‌ను ప్రారంభం రోజునే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లింగ్ కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, విద్యుత్ అంతరాయం వల్ల అమ్మకాలు ఆలస్యం కావడం గమనార్హం.

మహిళలకు తీవ్ర అసౌకర్యం

చిన్నారులతో వచ్చిన మహిళలు బిల్లింగ్ క్యూల్లో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. సరైన సదుపాయాలు లేకపోవడం, పార్కింగ్ సౌకర్యాలు లేక రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

విద్యుత్ సమస్య – బిల్లింగ్‌లో ఆలస్యం

“చీరలు కొన్నా, కానీ బిల్లు చేసే వరకు రెండు గంటలుగా క్యూలోనే ఉన్నాం. విద్యుత్ పోయిందని బిల్లు చేయలేదు” అంటూ పలువురు మహిళలు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

సినీ నటి రీతూ వర్మ, నేహా శెట్టి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని, హంపీ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

అంచనాలకు మించి స్పందన – కానీ అవ్యవస్థలు

సామాన్య ప్రజల అంచనాలకు అనుగుణంగా మాల్ ప్రారంభం జరగకపోవడంతో స్థానికులు నిరాశ చెందారు. భవిష్యత్‌లో ఇలాంటి భారీ ఈవెంట్లకు తగిన ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. యాజమాన్యం వినియోగదారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో అవస్థలు పడాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :