గ్రామాల అభివృద్ధికై బీజేపీ అభ్యర్థులను గెలిపించండి — మాజీ మేయర్ సునీల్ రావు

జనం పవర్, గంగాధర —

గ్రామ పంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని, అందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు ఓటర్లను కోరారు.

గంగాధర మండల బీజేపీ శాఖ అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సునీల్‌రావు మాట్లాడుతూ —

“ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపిస్తే, కరీంనగర్ ఎంపీ & కేంద్ర మంత్రి తమ ఎంపీ కోటా నిధుల నుండి ఒక్కో గ్రామానికి ₹10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు” అని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన —
“ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం లేదు. కేంద్ర నిధుల ద్వారానే గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, వివిధ పథకాలు అమలు జరుగుతున్నాయి” అన్నారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సహకారంతో గంగాధర మండలంలోని అనేక గ్రామాల్లో దాదాపు ₹3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.

“రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తే మరింత అభివృద్ధి కోసం బండి సంజయ్ గారు కృషి చేస్తారు” అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు — సడక్ యోజన, జాతీయ రహదారులు, 15వ ఆర్థిక సంఘం నిధులు — అన్నీ గ్రామీణాభివృద్ధికే అందుతున్నాయని పేర్కొన్నారు.

“గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీని బలపరచండి” అని సునీల్ రావు స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్‌కుమార్, పెంచాల రాములు, వొడ్నాల రాజు, హర్ష రాజు, వీరేందర్ రెడ్డి, దయ్యాల ప్రణయ్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :