జనం పవర్, గంగాధర — నవంబర్ 24
గంగాధర మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన సమస్యలను తెలుసుకుని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా పాఠశాలలో కూరగాయలు అందకపోవడం, కేవలం పప్పు, చారు, ఎగ్ కర్రీతోనే భోజనం పెట్టడం జరుగుతోందని విద్యార్థులు చెప్పారు. అన్నం కూడా సరిగా ఉడకకపోవడం, ఉదయం 3–4 గంటలకు లేపి చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయమంటున్నారని, బాత్‌రూమ్ సౌకర్యాలు లేవని వెల్లడించారు. అధికారులను ప్రశ్నించగా, గత 8–9 నెలలుగా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడంతో కూరగాయల సరఫరా నిలిచిపోయిందని ఆర్సీవో తెలిపారు. ఇటీవలి ఘటనలను గుర్తు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థ దుస్థితిని రవిశంకర్ విమర్శించారు. విద్యార్థులకు భద్రత, నాణ్యమైన ఆహారం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post Views: 160









