•సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
•లాభాల్లో 34% సింగరేణి కార్మికులకే..కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్
•కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి
•కోల్ ఇండియా నుుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి పంపిణీ
•మీడియా సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 22:
దసరా సందర్బంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్ చెల్లిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి అని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలోని 41 వేల శాశ్వత ఉద్యోగులకు మొత్తం రూ.819 కోట్లు బోనస్‌గా పంపిణీ చేయగా, 30 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.5,500 చొప్పున అందజేస్తామని తెలిపారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్‌ను దీపావళికి పంపిణీ చేస్తామని, భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని, ఆ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలపై భారమోపడం సరికాదని ఆయన హెచ్చరించారు. వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వైయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.









