జనం పవర్, రామగుండం, సెప్టెంబర్ 22:
వీధుల్లో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించేవారు పరిశుభ్రత , సురక్షిత విధానాలు పాటించాలని అడిషనల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ అన్నారు. లోక్ కళ్యాణ్ మేళా లో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమ వారం చిరువ్యాపారులకు భారత ఆహార భద్రత , ప్రమాణాల సంస్థ ( ఎఫ్ ఎస్ ఎస్ ఎ ) రూపొందించిన నియమావళి పై మెప్మా ఆద్వర్యంలో శిక్షకులు ఈశ్వర భరద్వాజ్ చే అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ ఆహారం ద్వారా సంక్రమించే అనారోగ్యాలను నివారించడానికి ఎఫ్ ఎస్ ఎస్ ఎ రూపొందించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. పని చేసే కార్మికులు శుభ్రతా ప్రమాణాలు పాటించడం , నాణ్యమైన ముడి సరుకులు వినియోగించడం , పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం ఆహార పదార్థాల విక్రయశాలల కు తప్పనిసరని అన్నారు. వ్యాపార అభివృద్ది కొరకు బ్యాంకుల సహకారంతో వీధి వ్యాపారులకు ఇస్తున్న సబ్సిడీ రుణాలు , క్రెడిట్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , మెప్మా డి ఎం సి మౌనిక , సి ఓ లు ఊర్మిళ , శ్వేత , ప్రియ దర్శిని , శమంత తదితరులు పాల్గొన్నారు.
.









