• బెదిరింపు మెయిల్‌తో హైఅలర్ట్
• ముంబయిలో మానవ బాంబులు అంటూ మెయిల్
• 14 మంది పాక్ ఉగ్రవాదులు.. 400 కిలోల ఆర్డీఎక్స్
• లష్కర్ ఏ జిహాదీ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు మెయిల్
• నగరంలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు
జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 5: ముంబయికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. 34 వాహనాల్లో మానవబాంబులు నగరంలోకి ప్రవేశించాయని పేర్కొంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. ‘‘ముంబయిలోకి 14 మంది పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవబాంబులను ఏర్పాటు చేశాం. వారి వద్ద 400 కిలోల ఆర్డీఎక్స్ ఉంది. ఇప్పుడు మేము చేపడుతున్న భారీ పేలుళ్లు మొత్తం ముంబయి నగరాన్ని కుదిపేస్తాయి’’ అని మెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. తాను పాక్‌కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడిగా మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని అన్నారు. నగరంలో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ముంబయి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే విధంగా ఇటీవల పట్నాలోని సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు బిహార్‌లోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిహార్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ జారీ చేసింది. ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదుగా బిహార్ చేరుకున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.









