• బెంజ్‌కు.. హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ వేయలేం
• వైవిధ్యభరితంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ
• కాంగ్రెస్ ప్రభుత్వంలో 91శాతం వరకు ఆదాయపు పన్ను
• మా ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రథమం
• పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావు
• ఇండియాటుడే ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి
జనం పవర్, హైదరాబాద్ :
మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు . వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణల పై ఆమె మాట్లాడారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే
జీఎస్టీ విధానంలో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు. జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వన్ నేషన్- వన్ ట్యాక్స్ మంచి ఆలోచనే కానీ.. ఆచరణలో అది సాధ్యం కాదు. అభివృద్ధిలో వైవిధ్యాలు ఉన్నప్పుడు ఏకరూప జీఎస్టీ రేటును అమలు చేయడం
అన్యాయమవుతుంది. మెర్సిడెస్ బెంజ్ కారు, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా? ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులను కట్టగలుగుతాయి. అభివృద్ధి
చెందని రంగాలకు అది భారమవుతుంది. ఒకవేళ భారత్ అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అప్పుడు ఒకే పన్ను విధానం సాధ్యమవుతుంది’’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నవారే..
ఈ సందర్భంగా విపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆర్థికమంత్రి విమర్శలు గుప్పించారు. ‘‘ఒకప్పుడు జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు పన్ను సంస్కరణలు చేయగానే క్రెడిట్ తీసుకునేందుకు ఆరాటపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 91శాతం వరకు ఆదాయపు పన్ను విధించిన రోజులు ఉన్నాయి’’ అని దుయ్యబట్టారు. జీఎస్టీలో సంస్కరణ వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయంలో కొంత కోత ఉంటుందని నిర్మలమ్మ తెలిపారు. తమ ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఆదాయం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్ల ఎగుమతిదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపైనా కేంద్రం దృష్పెటి ట్టినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనేదీ లేదని మరోసారి స్పష్టం చేశారు.









