📰 **కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కొక్కరకుంట గ్రామంలో యూరియా కోసం రైతుల ఆందోళన**
జనం పవర్ సెప్టెంబర్ 05 కొత్తపల్లి:
కరీంనగర్ జిల్లా కొక్కరకుంటలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటలు ఎండిపోతాయనే భయంతో పెద్ద సంఖ్యలో రైతులు సొసైటీ ముందు గుమికూడి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలలో నిలబడి ఎరువులు దొరకకపోవడంతో రైతులు అధికారులను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులను మోహరించారు.
రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం సమయానికి యూరియా అందించకపోవడం వల్లే పంటలు వాడిపోతున్నాయని ఆరోపించారు. అన్ని ఊర్లకు సమానంగా ఎరువులు అందడం లేదని, పైరవీలు ఉన్నవారికే మంజూరవుతోందని వారు మండిపడ్డారు. నిజమైన రైతులు ఇబ్బందులు పడుతుంటే కొందరు పైరవీలతో ఎక్కువ ఎరువులు తెచ్చుకుంటున్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
“మా పంటలు ఎండిపోతే బాధ్యత ఎవరిది? ఎందుకు ప్రతి రైతుకు అవసరమైనంత యూరియా ఇవ్వడం లేదు? ఎరువులు లేక పంట నష్టపోతే మాకేం చేయాలి?” అని రైతులు ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కొక్కరకుంట ప్రాంతంలోని ప్రతి గ్రామానికి సరిపడా యూరియా అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.









