* 15.23 కిలోల బంగారం, రూ.1.61 లక్షల నగదు రికవరీ
* 402 గోల్డ్ లోన్ ఖాతాల నుండి బంగారం దుర్వినియోగం
* 10 ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలలో 142 నకిలీ లోన్లు
* మూడు ఎస్బీఐ ఉద్యోగులతో సహా 44 మంది అరెస్టు
జనం పవర్,మంచిర్యాల ఆగస్టు 31:
మంచిర్యాల జిల్లా చెన్నూరులో వెలుగులోకి వచ్చిన భారీ బ్యాంక్ కుంభకోణం సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న బ్యాంకింగ్ మోసాల్లో ఇదొకటి అన్నట్లు, చెన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ-02 బ్రాంచ్)లో గోల్డ్ లోన్ల పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 44 మందిని పోలీసులు అరెస్టు చేయగా, అందులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. దర్యాప్తు అధికారి మరియు ప్రత్యేక బృందాల శ్రమ ఫలించి 15.23 కిలోల బంగారు నగలు, రూ.1,61,730 నగదు రికవరీ అయ్యాయి.
* ఫిర్యాదు నేపథ్యం
2025 ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శ్రీ రితేష్ కుమార్ గుప్తా,చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో 402 గోల్డ్ లోన్ ఖాతాల నుండి 25.17 కిలోల బంగారం (రూ.12.61 కోట్లు విలువ) మరియు రూ.1.10 కోట్ల నగదు దుర్వినియోగం చేయబడి దొంగిలించబడినట్టు వివరించారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ.భాస్కర్,ఐపీఎస్ పర్యవేక్షణలో,డీసీపీ మంచిర్యాల మార్గదర్శకత్వంలో నలుగురు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.దర్యాప్తు బాధ్యతను ఏ.వెంకటేశ్వర్,ఏసీపీ జైపూర్‌కు అప్పగించారు.
* దర్యాప్తులో బయటపడిన అసలు నిజాలు
బ్యాంకులో ఆడిట్ నిర్వహించగా,క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాలో అనుమానాస్పద డిపాజిట్లు కనిపించాయి.అదుపులోకి తీసుకొని విచారణ చేయగా,అతను 2024 అక్టోబర్‌లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు పోగొట్టుకున్నట్టు ఒప్పుకున్నాడు.ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్ సహకారంతో కుంభకోణానికి పాల్పడ్డాడు.బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ తాళం మేనేజర్,క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉండేది.అయితే,మేనేజర్ తన తాళాన్ని రవీందర్‌కి ఇవ్వడంతో,ఈ మోసానికి మార్గం సుగమమైంది.
అక్టోబర్ 2024 నుంచి రవీందర్ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి తన స్నేహితులకు అప్పగించేవాడు.స్నేహితులు ఆ బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుని,కొంత భాగం రవీందర్‌కు తిరిగి అందించేవారు.ఇప్పటివరకు 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ కంపెనీలలో 44 మంది పేర్లతో 142 గోల్డ్ లోన్లు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
* నకిలీ లోన్లు – పెద్ద ఎత్తున మోసం
క్యాషియర్ రవీందర్ తన భార్య,మరిది,స్నేహితుల పేర్లతో 42 తప్పుడు గోల్డ్ లోన్లు మంజూరు చేసి,రూ.1.58 కోట్లు విత్‌డ్రా చేశాడు. ఇవన్నీ వాస్తవ బంగారం లేకుండానే,రికార్డుల్లో 4.14 కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లు చూపించారు.అదనంగా,రవీందర్ ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బును దుర్వినియోగం చేసేవాడు.
* మొత్తం అరెస్టులు – రికవరీలు
ఇప్పటివరకు పోలీసులు 44 మందిని అరెస్టు చేశారు.అందులో 3 మంది ఎస్బీఐ అధికారులు,మిగతా వారు ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు మరియు ప్రైవేట్ వ్యక్తులు.
* రికవరీ అయినవి:
15.237 కిలోల బంగారం
రూ.1,61,730 నగదు
మిగిలిన బంగారు ఆభరణాలు ముత్తూట్ ఫైనాన్స్,మనప్పురం,ముత్తూట్ ఫిన్ కార్ప్,ముత్తూట్ మినీ చెన్నూర్ బ్రాంచ్‌లలో ఉండగా, వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
* నిందితుల వివరాలు
మొత్తం 44 మంది నిందితులలో ప్రధానులు:
A1.నరిగె రవీందర్ (క్యాషియర్,ఎస్బిఐ చెన్నూర్)
A2.వెన్నపురెడ్డి మనోహర్ (బ్రాంచ్ మేనేజర్,ఎస్బిఐ చెన్నూర్)
A3.లక్కాకుల సందీప్ (ఔట్సోర్సింగ్ ఉద్యోగి,ఎస్బిఐ చెన్నూర్)
అలాగే ఎస్.బి.ఎఫ్.సి,ఇండల్ మనీ,మనప్పురం,ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీల సిబ్బంది, స్థానిక వ్యక్తులు,బంధువులు కూడా ఈ మోసంలో భాగమయ్యారు.మొత్తం 44 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కొందరు ఇంకా పరారీలో ఉన్నారు.
* కేసు ఛేదనలో పోలీసులు చూపిన చాకచక్యం
చెన్నూరులో వెలుగులోకి వచ్చిన ఈ రూ.13 కోట్ల గోల్డ్ లోన్ మోసం,బ్యాంకింగ్ రంగంపై ప్రజల్లో నమ్మకానికి పెద్ద దెబ్బ కొట్టింది.ఉద్యోగులే అక్రమాలకు పాల్పడటం,ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు సహకరించడం పెద్ద చర్చనీయాంశమైంది.44 మంది అరెస్టు,15.23 కిలోల బంగారం రికవరీ అయినప్పటికీ,ఇంకా స్వాధీనం చేయాల్సిన బంగారం ఉంది.గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటన బ్యాంకింగ్ రంగానికి బిగ్గర హెచ్చరిక. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన పర్యవేక్షణా చర్యలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు డీసీపీ మంచిర్యాల ఏ.భాస్కర్,ఏసీపీ జైపూర్ ఏ.వెంకటేశ్వర్,చెన్నూర్ సీఐ బన్సీలాల్,ఇతర సీఐలు,ఎస్ఐలు,సిబ్బందినీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు.










