ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి- ఢిల్లీ ముఖ్యమంత్రిపై 30 ఏళ్ల యువకుడి దాడి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి భద్రతా వైఫల్యంపై అనుమానాలు

జనంపవర్, హైదరాబాద్

ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత రేఖా గుప్తాపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు సీఎం రేఖా గుప్త ప్రతి వారంవారం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన అధికారిక నివాసంలో ప్రజలను కలుస్తారు.

ఈ రోజు ఉదయం కూడా సీఎం రేఖా గుప్త ప్రజల సమస్యలు తెలుసుకుంటుండగా, 30 ఏళ్ల యువకుడు ఒకరు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. అతడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్ సకారియాగా గుర్తించారు. తన సమస్యలు చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా చూపుతూ, కొన్ని పేపర్లు ముఖ్యమంత్రికి అందజేసిన దుండగుడు, అనంతరం ఆమెకు చెంపదెబ్బ కొట్టాడని అధికార వర్గాలు తెలిపాయి.

తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి అనంతరం సీఎం రేఖా గుప్తను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమెను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రిపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌, మంత్రి మజిందర్ సింగ్ సిస్రా సహా పలువురు నేతలు ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.

ఇక, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని, ఇలాంటి చర్యలు ఖండనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు దుండగుడిని విచారిస్తున్నారని, భద్రతా వైఫల్యంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :