జనం పవర్, పెద్దపల్లి ఆగస్టు 16:
పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలంలో వైద్యసదుపాయాల లేమి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతం కానప్పటికీ, ఇక్కడి పరిస్థితులు మరింత దారుణంగా ఉండటం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో జమ్మికుంట, కరీంనగర్, హన్మకొండ వరకు రెండు,మూడు గంటల ప్రయాణం తప్పని సరిగా మారుతోంది. ఈలోపు పరిస్థితి విషమించి అనేక ప్రాణాలు మార్గమధ్యంలోనే ఆగిపోతున్నాయి. హార్ట్‌స్ట్రోక్స్, రోడ్డు ప్రమాదాలు, ప్రసవాల సమయంలో ఎదురయ్యే
సంక్షోభాల్లో సమయానికి వైద్య సహాయం అందక కుటుంబాలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి.
* 24 గంటల ఆసుపత్రి లేక అవస్థలు
వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఓదెలలో కనీసం 24 గంటల ఆసుపత్రి లేకపోవడం,డాక్టర్లు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. “అరగంట ముందే తెచ్చివుంటే ప్రాణాలు నిలిచేవి” అని డాక్టర్లు చెప్పడం కానీ,రోగులు మార్గమధ్యంలోనే మృతిచెందడం స్థానికుల బాధను రెట్టింపు చేస్తోంది.
* స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా మారని వాస్తవం
ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా, ఓదెలలో వైద్యసదుపాయాల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నప్పటికీ, ఆసుపత్రి మాత్రం ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గుండెపోటు కేసులు అధికమవడం, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడం, వృద్ధులు మరియు గర్భిణీలు చికిత్స లేక ప్రాణాలు కోల్పోవడం తరచూ జరుగుతోంది. అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ సమీపంలో ఆసుపత్రి లేకపోవడం వల్ల ఆ ప్రయాణమే రోగికి చివరి మజిలీ అవుతోంది.

* ప్రజల ఏకగ్రీవ డిమాండ్
ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి, ఓదెల మండలంలో అన్ని రకాల వైద్యసేవలు అందించే, 24 గంటల డాక్టర్లు, అత్యవసర విభాగం, శస్త్రచికిత్సల సౌకర్యం కలిగిన ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానికులు గళమెత్తుతున్నారు.
ఇటీవల 80 కోట్ల నిధులతో బ్రిడ్జి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గారు, అభివృద్ధి పనులతో పాటు ఆసుపత్రి ఏర్పాటుకు కూడా దృష్టి సారిస్తేనే ప్రజల ప్రాణాలను రక్షించగలమని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
“ఓదెలలో రోడ్లు, బ్రిడ్జిలతో పాటు ఆసుపత్రి కూడా నిర్మిస్తేనే అభివృద్ధి పూర్తి అవుతుంది. మరిన్ని చావులు చూడక ముందే హాస్పిటల్ ఏర్పాటు కావాలి” – ఇదే ఓదెల ప్రజల ఏకగ్రీవ డిమాండ్.









