కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..టోల్ ఫ్రీ నెంబర్ 966623438కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచన
జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 16:
జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందిని అప్రమత్తంగా చేస్తూ నిత్యం ఫీల్డ్ లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. శనివారం పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత పరిస్థితులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. జగిత్యాల మండలం రూరల్ గ్రామం అనంతారంలో లెవెల్ వంతెన, రాయపట్నం వంతెన, ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతం, నేరెళ్లలో లెవన్ వంతెన, ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాదకరంగా ఉండే నాలాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మనుషులకు గాని పశువులకు గానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు.ఈ మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్ క్వార్టర్ ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్లకూడదని, అప్రమత్తంగా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రమాదకర పరిస్థితి తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 966623438 కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అపాయము, ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
రేచపల్లి ఊరు చెరువు పరిశీలన
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామం ఊరు చెరువు వరద నీరు ఎక్కువ వస్తున్నందున మత్తడినీ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు, ఆయా గ్రామాల వారు వరద ప్రవాహం ఎక్కువ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ ధర్మపురి మండల తహసిల్దార్ శ్రీనివాస్, ధర్మపురి సిఐ ఎస్ఐ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









