జనం పవర్, రామగుండం ఆగస్టు 16:
రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా కుందనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఐదుగురికి కళ్యాణలక్ష్మి, ఇద్దరికీ షాదీ ముబారక్, 25 మందికి తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామంలో కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రీట్‌లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అర్హులైన వారికి ఇళ్లు సహా అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని గ్రామస్తులకు సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు అధికారుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
తదుపరి పెద్దంపేట గ్రామంలో నిర్వహించిన సభలో 32 మందికి తెల్ల రేషన్ కార్డులు, ఐదుగురికి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతు సంక్షేమం దృష్ట్యా పలు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇటీవల ముర్మూర్ ఎత్తిపోతల పథకం ప్రారంభించడం ద్వారా ఎండిన భూములు సాగునీటితో పంటలతో కళకళలాడేలా మారాయని వివరించారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. పెద్దంపేటలో మూడు కోట్ల రూపాయల నిధులతో పలు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలన ప్రజలకు మాటలు మాత్రమే ఇచ్చిందని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవంగా చేతల్లో చూపుతోందని ఎమ్మెల్యే విమర్శించారు.










