జనం పవర్, పెద్దపల్లి ఆగస్టు 16:
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ విడతల వారీగా ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. శనివారం జర్నలిస్టుల జేఏసీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం రాకపోవడాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే, ఇప్పుడు తప్పకుండా స్థలాలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వెంటనే ఆర్డీవో బొద్దుల గంగయ్యకు ఫోన్ చేసి వారం రోజుల్లో ప్రభుత్వ భూములపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే భూమి కలిగిన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణానికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తారని, వారి సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీకి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.









