జనం పవర్, జగిత్యాల ఆగష్టు 16:
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత పరిస్థితులను జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలోని పోలీస్ అధికారులు గోదావరి నది పరివాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలతో పాటు ప్రధాన రహదారులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కల్వర్ట్లు, బ్రిడ్జిలు నీటిమునిగే ప్రమాదం ఉన్నందున, వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, వాగులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయకూడదని అన్నారు. వర్షాల కారణంగా ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 100 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.









