జనం పవర్,పెద్దపల్లి,ప్రతినిధి ఆగస్టు 16:
ఇంటి వంటింటి అనుబంధంగా మారిన ఎల్‌పీజీ సిలిండర్ ఒకవైపు సౌకర్యం కల్పిస్తే, మరోవైపు చిన్నపాటి లోపమే తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. గ్యాస్ లీకేజీతో పేలుడు సంభవిస్తే క్షణాల్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వినియోగదారులకు భరోసా కల్పించేందుకు పెట్రోలియం కంపెనీలు ప్రత్యేక ఎల్‌పీజీ బీమా పథకం అమలు చేస్తున్నాయి. ప్రతి గ్యాస్ కనెక్షన్‌తోపాటు వినియోగదారులకు 40 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ లభిస్తోంది.
గ్యాస్ లీకేజీ,సిలిండర్ పేలుడు కారణంగా ప్రమాదం జరిగితే తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. సిలిండర్‌లో లోపం తేలితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ బీమా కింద గరిష్టంగా 40 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టం సంభవిస్తే ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు బీమా రక్షణ, తీవ్ర గాయాలపై 15 లక్షల వరకు వైద్య ఖర్చులు, ఆస్తి నష్టానికి రెండు లక్షల వరకు పరిహారం లభిస్తుంది.
ఇన్సూరెన్స్ పొందే విధానం
ప్రమాదం జరిగితే ముందుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం నమోదు చేయాలి.
గ్యాస్ సరఫరా చేసే డీలర్‌కు ఘటన వివరాలు తెలియజేయాలి. దర్యాప్తు పూర్తయ్యాక ప్రమాద తీవ్రత ఆధారంగా అనంతరం కేసు న్యాయపరమైన విచారణకు వెళ్తుంది ప్రమాద బీమా అందుతుంది.
ఇప్పటికే కొన్ని గ్యాస్ కంపెనీలు వినియోగదారులందరికీ ఇన్సూరెన్స్ ప్రక్రియను ఇంటింటికీ వెళ్లి ప్రారంభించింది. దీనికిగాను ఐదు సంవత్సరాలపాటు కొంత ప్రీమియంనీ నిర్ణయించారు. అలాగే ప్రతి రెండు సంవత్సరాలకు కంపెనీ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి గ్యాస్ కనెక్షన్‌ను పరిశీలిస్తారు. గ్యాస్ రెగ్యులేటర్, పైప్‌ను వినియోగదారులు రెండు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకుముందు ఈ బీమా రెండు సంవత్సరాలకే పరిమితం కాగా, ఇప్పుడు దాన్ని ఐదు సంవత్సరాలుగా పొడిగించారు.
ప్రతి గ్యాస్ వినియోగదారుడు ఈ బీమా సదుపాయాన్ని పొందేందుకు ముందుకొచ్చి భద్రతా పరిరక్షణ పొందాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఎల్‌పీజీ బీమా పథకం వినియోగదారుల ప్రాణ భద్రతకు, ఆస్తి రక్షణకు ఆపద్బాంధవంగా నిలుస్తోంది.









