జనం పవర్, మంథని, ఆగస్టు 16:
భూ ఆక్రమణలు భూకబ్జాలు అర్బన్ ఏరియాలో షరా మామూలుగా జరుగుతుండగా ఆ జాడ్యం ఇప్పుడు రూరల్ ప్రాంతాలకు పాకింది. తమ రాజకీయ పలుకు బడిని ఉపయోగించి చెరువులను, కుంటలను చెరబడుతున్నారు.చెరువు శిఖాలను నీవేశన స్థలాలుగా మార్చుతున్నారు. మరికొందరు ఎకరం, రెండు ఎకరాల వరకు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంట విస్తీర్ణం నానాటికి తగ్గిపోతున్నది.
మర్రికుంట క్రింద 60 ఎకరాలకు సాగునీరు అందేదని స్థానిక రైతులు అంటున్నారు . ప్రస్తుతం శిఖం భూమి కబ్జాకు గురికావడం వల్ల నీటిమట్టం తగ్గి రైతులకు సాగునీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మర్రికుంటలో మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయని తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ భూమిపై కన్నేసి మర్రికుంట శిఖం భూమిలో మట్టి పోసి, ఇండ్ల కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ఊరి అభివృద్ధి కొరకు భవిష్యత్ తరాల కొరకు మర్రి కుంటను కాపాడాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు.









