జనం పవర్, కమాన్పూర్ ఆగస్టు 7:
కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆదివరాహ స్వామి దేవాలయంలో జయంతి ఉత్సవాల చివరి రోజు వేడుకలు 07-08-2025 గురువారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 8:30 గంటల నుండి స్వామివారికి నిత్యాభిషేకం, గోపూజలు వైభవంగా జరిగాయి.
తదనంతరం ఉదయం 9 గంటలకు వరాహ జయంతిని పురస్కరించుకుని అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. 108 పవిత్ర కళశాలతో స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించడం విశేషం.
మధ్యాహ్నం 12:30 గంటలకు ఆదివరాహ స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి కవచాన్ని అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం జరిగిన మహాప్రసాద వితరణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో శ్రీ కే. కాంతారెడ్డి, కమాన్పూర్ మండల తహసీల్దార్ శ్రీమతి వాసంతి, ఆర్ఐ స్రవంతి, ఎస్సై కొట్టే ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, భక్తజనం పెద్దఎత్తున పాల్గొన్నారు.









