జనం పవర్, కొండగట్టు : నవంబర్ 30
జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టులో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దిగువ కొండగట్టులో వరుసగా ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. దాదాపు 30 దుకాణాలు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైనట్లు తెలిసింది.
అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు మంటలు అదుపులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నా, వాహనం ఆలస్యంగా రావడంతో నష్టం మరింత పెరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిలిండర్ పేలుడు కారణంగా ప్రమాదం జరిగిందా? లేక షార్ట్ సర్క్యూట్ కారణమా? అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అగ్ని ప్రమాదం వల్ల లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
అర్ధరాత్రి ఘటన కావడంతో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. మంటలు అదుపులోకి వచ్చాయి.








