జనం పవర్, కరీంనగర్:
కేవలం 7 రోజుల వయసున్న పసికందును విక్రయానికి ప్రయత్నించిన ముఠాను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన డయల్ 100 సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి నిందితులందరినీ పట్టుకున్నారు.
విజాగ్ కు చెందిన 22 సంవత్సరాల శీలం సాయిశ్రీ భర్తతో విబేధాల కారణంగా గర్భిణీ స్థితిలోనే హైదరాబాద్ కు వచ్చి స్నేహితులు అభినవ్ హీనా వద్ద ఆశ్రయం తీసుకుంది. నవంబర్ 14 న గాంధీ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సమయంలో ఆమె ఆర్థిక ఇబ్బందులను గమనించిన అభినవ్ హీనా బిడ్డను పోషించడం కష్టమని అమ్మేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ప్రలోభ పెట్టారని పోలీసులు తెలిపారు. అంగీకరించిన సాయిశ్రీని తీసుకుని హీనా తనకు తెలిసిన పల్లవి భవాని అనే మధ్యవర్తులతో కలిసి కరీంనగర్ లో కొనుగోలు దారులను ఏర్పాటుచేసింది.
కొనుగోలు ధరను 5 లక్షలకు ఖరారు చేయడంతో నవంబర్ 20 న ముఠా సభ్యులు డ్రైవర్ అశోక్ తో కలిసి కారులో కరీంనగర్ కు వచ్చారు. భవాని సూచన మేరకు ఆర్య ఆసుపత్రి వద్ద కొనుగోలు దారులకు పసికందును చూపించారు.
ఈ సమయంలో డబ్బుల విషయంలో మాట్లాడుతున్న తీరు అనుమానం కలగడంతో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ వెంటనే డయల్ 100 కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ముఠా అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.
తర్వాత కిసాన్ నగర్ ప్రాంతంలో భవాని 5 లక్షలు తీసుకుంటున్న సమయంలో టూ టౌన్ ఎస్సై జె అరుణ్ బృందం దాడి చేసి తల్లి సాయిశ్రీ మధ్యవర్తులు హీనా అభినవ్ భవాని డ్రైవర్ అశోక్ లను అదుపులోకి తీసుకుంది.
పోలీసులు పసికందును సురక్షితంగా రక్షించడంతో పాటు విక్రయానికి తీసుకువచ్చిన 5 లక్షలు కారు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.









