జనం పవర్, హనుమకొండ, నవంబర్ 08:
హనుమకొండ జిల్లాలో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇష్టారీతిలో అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్న రైస్ మిల్లుల యాజమాన్యంపై, వీరికి సహకరిస్తున్న ప్రభుత్వ జిల్లా అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిష్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం, ఎన్ ఎ స్టాలిన్, వేల్పుల సారంగపాణి, జిల్లా సమితి సభ్యులు అలువాల రాజులు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ మండల చుట్టు పక్కల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఐ పార్టీ బృందం సందర్శించి రైతులతో మాట్లాడింది. కోతల సమయంలో పడ్డ భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినడమే కాకుండా ధాన్యం కోతకు ఖర్చులు విపరీతంగా పెరిగినందున ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాల్లో తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వాధికారులను డిమాండ్ చేశారు. జిల్లాలో గత కొన్నేళ్ళుగా రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారని, అధికారుల అండతో రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని వారు అన్నారు. విజిలెన్స్ వారికి చిక్కిన మిల్లర్ల పై, వారికి సహకరించిన అధికారులపైన నామ మాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడంతో మరొకరికి భయం లేకుండా పోతుందన్నారు. అలాగే ప్రభుత్వం వారు కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యాన్ని పైసా ఖర్చు లేకుండా సొంతానికి వాడుకొని సొమ్ము చేసుకుంటుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అని ఈ సంధర్భంగా వారు ప్రశ్నించారు. ధాన్యం నిలువ చేసుకున్నందుకు, మర ఆడించినందుకు డబ్బులు తీసుకోవడమే కాకుండా తవుడు, ఉనుక, నూకలు వంటి వాటితో మిల్లులు గతం కంటే బాగానే నడుస్తుండగా తరుగు పేరుతో అదనంగా దోపిడీ చేయడమే కాకుండా నిలువ ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ప్రభుత్వానికి తగిన సమయంలో సరఫరా చేయకుండా ఫ్రీగా వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొమ్మటి ప్రవీణ్ కుమార్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.









