జనం పవర్, అమరావతి, అక్టోబర్14:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టెక్ దిగ్గజం గూగుల్ మధ్య విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడి, విశాఖలో తొలి ఏఐ హబ్ ప్రణాళికలను వివరించారు. ఈ విషయాన్ని ఆయన తన ‘ఎక్స్ ’ పోస్ట్ లో పంచుకున్నారు.
సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, “విశాఖలో గూగుల్ తొలి ఏఐ హబ్ ఏర్పాటు ఒక కీలక మైలురాయి. ఈ హబ్ లో గిగావాట్ సామర్థ్యం గల హైపర్ డేటా సెంటర్ , అంతర్జాతీయ సబ్ సీగేట్ వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ హబ్ ద్వారా భారత్ ని సంస్థలు, వినియోగదారులకు అధునాతన సాంకేతికతను అందిస్తాం. కృత్రిమ మేధ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తాం” అని తెలిపారు.
దిల్లీలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ , రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ , గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ రానున్న ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది, ఇది భారత్ గూగుల్ యొక్క అతిపెద్ద పెట్టు బడిగా నిలవనుంది.
గూగుల్ క్లౌడ్ గ్లో బల్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, “విశాఖపట్నం గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మారనుంది. సబ్ సీకేబుల్ విధానం ద్వారా విశాఖ నుంచి12 దేశాలతో అనుసంధానం చేస్తాం” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “మొదట మైక్రోసాఫ్ట్ , ఇప్పుడు గూగుల్ .. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో గ్లోబల్ హబ్ గా ఎదుగుతోంది. ఈ ఒప్పందం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఊతమిస్తుంది” అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం సాంకేతిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఏర్పడనుంది.









