బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆటో జేఏసీ వినతిపత్రం

 

జనం పవర్,రామగుండం అక్టోబర్ 14:
తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఆటోలకు ఉచిత పార్కింగ్ స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే, 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, నెలకు రూ.12,000 ఆర్థిక సాయం, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, బీమా ప్రీమియం రూ.8,000 నుంచి రూ.1,000కు తగ్గించడం, అలాగే చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ డిమాండ్లపై రామచంద్రరావు సానుకూలంగా స్పందిస్తూ, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం, రైల్వే స్టేషన్లలో పార్కింగ్ సదుపాయాల కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు నీలారపు రవి, జిల్లా కోశాధికారి లంకెల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సదానందం, తాండూరు మండల అధ్యక్షుడు మొహమ్మద్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :