జనం పవర్,పెద్దపల్లి ప్రతినిది అక్టోబర్ 14:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఉపాధ్యాయులు థింక్-పేర్-షేర్ విధానంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులకు థింక్-పేర్-షేర్ విధానంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మౌనంగా ఉండేవారు, తక్కువ చురుకుగా ఉండేవారిని కూడా బోధనలో భాగస్వామ్యం చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. “థింక్-పేర్-షేర్ విధానం ద్వారా ప్రతి విద్యార్థికి మాట్లాడే, ఆలోచించే, చర్చించే అవకాశం లభిస్తుంది. దీని వలన విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరిగి, బోధన ఫలితాలు మెరుగవుతాయి,” అని ఆయన అన్నారు.
ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు ఉపాధ్యాయులు దీని సూత్రాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమంలో తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
విద్యా వ్యవస్థలో మార్పు ఉపాధ్యాయుల చొరవతోనే సాధ్యమని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి తరగతిలో చురుకుగా పాల్గొనేలా బోధనా విధానాలు రూపుదిద్దుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









