అంతరిక్షంలో భారత్ కొత్త ప్రయత్నం

• ‘బాడీగార్డ్‌’ ఉపగ్రహాలకు భారత్‌ సన్నాహాలు
• ప్రమాదంలో గురి కాకుండా రక్షణగా బాడీగార్డ్‌ శాటిలైట్స్‌
జనం పవర్ , హైదరాబాద్, సెప్టెంబర్ 22:

ప్రస్తుతం శాటిలైట్‌ కమ్యూనికేషన్లు ప్రజల రోజువారీ కార్యకలాపాలకు అత్యంత ముఖ్యమైనవి. ఒక్కరోజు ఇవి ఆగిపోయినా జనజీవనం స్తంభించిపోతుంది. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో వీటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. గతంలో అంతరిక్షంలో మన ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను తృటిలో తప్పించుకున్నాయి. అందుకే వాటికి రక్షణగా బాడీగార్డ్‌ శాటిలైట్స్‌ను తయారుచేయాలని కేంద్రం భావిస్తోంది. ఇవి మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకుంటాయి. 2024 సంవత్సరం మధ్యలో భూమికి 500-600 కిలోమీటర ఎత్తులో మన ఉపగ్రహం పరిభ్రమిస్తోంది. దాదాపు అదే ఎత్తులో ఎలాన్‌ మస్క్‌కి చెందిన స్టార్‌ లింక్‌ శాటిలైట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మన పొరుగుదేశానికి చెందిన ఓ స్పేస్‌ క్రాఫ్ట్‌ కూడా గతంలో మన మిలిటరీ ఉపగ్రహానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. రెండింటి మధ్య దూరం కిలోమీటర్‌ కంటే తక్కువ ఉంది. కొన్ని సందర్భాల్లో తమ శక్తి ప్రదర్శన కోసం ఆయా దేశాలు కావాలనే ఇటువంటి పనులు చేస్తాయి. ఏమిటీ ప్రాజెక్టు..? ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ.270 కోట్లతో 50 నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని భావిస్తోంది. వీటిని వచ్చే సంవత్సరం ప్రయోగించవచ్చని భావిస్తున్నారు. గత 70 ఏళ్లలో పాకిస్థాన్‌, చైనాతో మన దేశం పలు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. వీటిలో చైనా అంతరిక్ష రంగంలో బాగా ముందడుగు వేసింది. పాకిస్థాన్‌కు మాత్రం ఎనిమిది ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక మన వద్ద వీటి సంఖ్య 100 దాటేసింది. చైనా వద్ద అందరికంటే ఎక్కువగా 930కి పైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో మన ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్రం స్టార్టప్‌ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ శాటిలైట్స్‌ను పంపాలని యోచిస్తోంది. వీటివల్ల భూమి కమాండ్‌ సెంటర్లనుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. వీటితోపాటు భూమిపై భారీ రాడార్లు, టెలిస్కోప్‌లు వంటి వాటితో వ్యవస్థలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని ఇస్రో కెపాసిటీ బిల్డింగ్‌ ఆఫీస్‌ మాజీ డైరెక్టర్‌ సుధీర్‌ కుమార్‌ వెల్లడించారు. 24 గంటలూ కక్ష్యలో జరిగే పరిణామాలను ట్రాక్‌ చేసే వ్యవస్థలు ప్రస్తుతం మన వద్ద లేవని పేర్కొన్నారు. కొన్ని స్టార్టప్‌లు ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నట్లు చెప్పారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :