• అమెరికా కంపెనీలపై చెల్లించాల్సిన డబ్బు
• ట్రంప్ హెచ్1బీ వీసా నిర్ణయంతో దెబ్బ
• లోకల్ వాళ్లను నియమింంచుకునేల ప్లాన్
• విదేశీయుడు అయితే లక్ష డాలర్లు చెల్లించాల్సిందే
• ట్రంప్ ప్రకటనను న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం
జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 22:
అమెరికా టెక్ కంపెనీల యాజమాన్యాలు ఇకనుంచి హెచ్1బీ వీసాలపై ఏటా 14 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి రావొచ్చని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. వీసాల ఫీజును భారీగా పెంచి లక్ష డాలర్లుగా నిర్ణయించడం సంస్థలకు మోయలేని భారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఫిబ్రవరిలో లాటరీలో రానున్న కొత్త దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తించనుంది. అమెరికన్లను నియమించుకునేలా కంపెనీలపై ఒత్తిడి చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గతేడాది మొత్తం 1,41,000 హెచ్1బీ వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లెక్కలు వెల్లడించాయి. అదే స్థాయిలో వీసాలు జారీ చేస్తే, వాటి కోసం చెల్లించాల్సిన ఫీజు 14 బిలియన్ డాలర్లు (రూ.1.23 లక్షల కోట్లు) వరకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నిర్ణయం స్టార్టప్ సంస్థలకు శరాఘాతమని వై కాంబినేటర్ సీఈవో గారీటాన్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లోని టెక్ హబ్‌లకు ఇది ఓ బహుమతిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ నిర్ణయం అధికారాల పరిధిని దాటి తీసుకున్నదని, న్యాయస్థానాలు అడ్డుకునే అవకాశం ఉందని అంటున్నారు. వీసాలకు కనీస వేతనం పెంపు వంటి విస్తృత మార్పులపై దృష్టి పెట్టి ట్రంప్ కార్యవర్గం ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు లాటరీ విధానం కాకుండా జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.









