జనంపవర్,పఠాన్ చేరు, సెప్టెంబర్ 10 :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపంలో బుధవారం బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. వేలాదిగా హాజరైన జనం, భారీ ర్యాలీతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌కు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముదిరాజ్ జాతి హక్కుల సాధనకు అన్ని సంఘాలు ఏకమవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చే ప్రక్రియలో టీఎంపీఎస్ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, సర్పంచులుగా ముదిరాజ్ బిడ్డలు రాణించాల్సిన అవసరం ఉందన్నారు.
మరాఠా ఉద్యమ స్ఫూర్తితో దక్షిణ భారత మత్స్యకారులు ఏకమైతే తగిన రిజర్వేషన్ సాధించుకోవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. త్వరలోనే మేధావులు, వ్యాపారులు, సంఘాలతో కలిసి ముఖ్యమంత్రిని కలసి డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరబోయిన మహేష్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కొలిపాక నరసయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూనంచుల మహేందర్, టీఎంపీఎస్ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.









