• ఇంటి నిర్మాణ దశ అప్‌లోడ్
• ఇందిరమ్మ మొబైల్ యాప్‌లో కొత్త ఆప్షన్ ఏర్పాటు
• బిల్లుల ఆలస్యం, సిబ్బంది చేతివాటానికి ముగింపు
జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 5 : ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ డబ్బులు జమ చేయడంలో ఆలస్యం కాకుండా, అధికారుల చేతివాటానికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల కోసం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మొబైల్ యాప్‌లో కొత్త ఆప్షన్ (ఫొటో క్యాప్చర్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణం ముగ్గు, పునాది, గోడలు, శ్లాబ్ వంటి దశల్లో ఉన్నప్పుడు అధికారులు, సిబ్బంది ఫొటోలు తీసి మొబైల్ యాప్‌లో నమోదు చేస్తేనే లబ్ధిదారులకు నిర్మాణానికి సంబంధించి నిధులు జమ అయ్యేవి. అయితే, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ దశను యాప్‌లో నమోదు చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని హౌసింగ్‌శాఖ ఇందిరమ్మ ఇళ్లు యాప్‌లో ఫొటో క్యాప్చర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా లబ్ధిదారులే నేరుగా తమ ఇంటి నిర్మాణ దశను మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారులు గురువారం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. యాప్‌లో అప్‌లోడ్ చేయడం ఇలా ఉంటుంది: ముందుగా ఇందిరమ్మ ఇళ్లు అనే మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో బెనిఫిషియరీ లాగిన్‌కు వెళ్లాలి. అక్కడ డాష్‌బోర్డులోకి వెళ్లి లబ్ధిదారుడి పేరు, మొబైల్ నంబరు, గ్రామం నమోదు చేయాలి. అనంతరం ఫొటో క్యాప్చర్ ఆప్షన్ వస్తుంది. ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో అడుగుతుంది. ఆ వివరాలను నమోదు చేసి ఆ దశకు సంబంధించిన ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణ వివరాలను కూడా నమోదు చేయాలి. తర్వాత ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్ వివరాలను చూపుతుంది. వీటికి సంబంధించిన చిత్రాలు యాప్‌లో ఉంటాయి. యాప్‌లో అడిగే ప్రశ్నలకు అవును/కాదు అని సమాధానం చెప్పాలి. తర్వాత ఇంటి నిర్మాణ దశ అప్‌లోడ్ అవుతుంది. ఎవరైనా లబ్ధిదారుడు తప్పుడు ఫొటోలను అప్‌లోడ్ చేస్తే స్థానిక అధికారుల, సిబ్బంది విచారణలో బయటపడుతుంది. త్వరలోనే లబ్ధిదారులకు ఈ యాప్‌కు సంబంధించి అధికారులు అవగాహన కల్పించనున్నారు.









