•మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
జనం పవర్, హైదరాబాద్ సెప్టెంబర్5 :
చెన్నైకి చెందిన ఓ వైద్య దంపతుల మధ్య జరిగిన వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యకు స్వంతంగా అధిక ఆదాయం, ఆస్తులు ఉన్నప్పుడు భర్త నుంచి భరణం పొందే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఆ కోర్టు, భర్త తన భార్యకు నెలకు రూ.30 వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భర్త హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి కుమారుడు నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడని, చదువుకు కావలసిన రూ.2.77 లక్షలు చెల్లించేందుకు పిటిషనర్ సిద్ధమని రికార్డులో ఉంచారు. భార్యకు స్వంత ఆదాయం ఎక్కువగా ఉందని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్నట్లు పత్రాలతో నిరూపించబడిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త నుంచి భరణం వసూలు చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. కుమారుడి చదువు ఖర్చుల విషయంలో భర్త స్వచ్ఛందంగా భరిస్తానని అంగీకరించినందున ఆ అంశంలో కోర్టు జోక్యం అవసరం లేదని తెలిపింది. ఫలితంగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన భరణం చెల్లింపుల ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.









