నూతన విద్యా విధానం కావాలి

•విద్యను గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుంది
•చివరకి ఉస్మానియా వర్శిటీ మూసే పరిస్థితి వచ్చింది
•విద్యాశాఖ నా పర్యవేక్షణలో ప్రతి సమస్య పరిష్కారం
•ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ
•విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా
•టీచర్లు విద్యార్థుల్లో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి
•వారికి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుంది
•చాలా చోట్ల కేజీ టూ పీజీ విద్య అందడం లేదు
•పిల్లలతో కలిసే టీచర్ల మధ్యాహ్న భోజనం చేయాలి
•తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలి
•గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 5:
విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుపూజోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిసమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని, తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు.‘‘ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ళ కంటే నాణ్యమైన విద్య అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి.. అక్కడి విద్యా విధానం అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తాం. దిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి సీఎం కావడానికి ఆయన చేసిన విద్యాభివృద్ధే కారణం.
నాకూ స్వార్థం ఉంది. టీచర్లు బాగా పని చేస్తే నేనూ రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా. మీతోపాటే నేనూ కష్టపడతా. నేను ఫామ్‌హౌస్‌లో పడుకుంటా.. మళ్లీ సీఎంను చేయండి అని అనట్లేదు. విద్యాభివృద్ధి కోసం టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఐటీఐలు అప్‌డేట్‌ చేసి అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌గా మార్చాం. ఏటీసీలో టాటా కంపెనీ కల్పించిన సదుపాయాలు చూస్తే నాకే మతిపోయింది.  నేనూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చాను. గతంలో గురుపూజోత్సవం ఎప్పుడైనా జరిగిందా..? అందులో సీఎం పాల్గొన్నా రా? తెలంగాణ పునర్నిర్మాణంలో టీచర్ల సహకారం కావాలి. పిల్లలు ఎక్కువ సమయం టీచర్ల వద్దే ఉంటారు. పిల్లలతో కలిసే టీచర్లు మధ్యాహ్న భోజనం చేయాలి.
వర్సిటీలకు వీసీలను నియమించడానికి గత ప్రభుత్వానికి తీరిక లేదు. ప్రస్తుతం ప్రభుత్వం, టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రైవేట్‌ స్కూళ టీచర్ల కంటే.. ప్రభుత్వ టీచర్లకు నైపుణ్యం ఎక్కువ. వివాదాస్పదమైన విద్యాశాఖ తీసుకోవద్దని నాకు కొందరు సూచించారు. అయినా వినకుండా ఈ శాఖను నా వద్దే ఉంచుకున్నా’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :