ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించిన ముఖ్యమంత్రి
• దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధి
• గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్
• గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నా
• ప్రభుత్వం తరఫున అన్ని సహకారాలు అందిస్తాం : రేవంత్ రెడ్డి
జనం పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 5 :
ఖైరతాబాద్ మహాగణపతి ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్త ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 71 ఏళ్ల క్రితం గణేశ్ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్టించుకుని ఉత్సవాలను ప్రారంభించింది. దేశంలోనే గణేశ్ ఉత్సవాలకు ఖైరతాబాద్ ప్రసిద్ధిచెందింది. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈరోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం అని రేవంత్‌రెడ్డి అన్నారు.









