యూపీఎస్సీ వాళ్ల కోసం కొత్త పోర్టల్

అభ్యర్థు ల కోసం ప్రతిభా సేతు ఏర్పాటు
• స్వల్ప తేడాతో చోటు లేనివాళ్ల కోసమే..
• వారందరి లిస్ట్ ఈ పోర్టల్ ఉండనుంది
• ప్రైవేట్ కంపెనీలు వాళ్ల కీ ఉద్యోగాలివ్వచ్చు
• ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తు న్నాయి
• భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగాయి
• అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు
• మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ
జనం పవర్, హైదరాబాద్, ఆగస్టు 31 :
యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మన్‌కీ బాత్‌ 125వ కార్యక్రమంలో మోదీ తెలిపారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఒకటని.. ప్రతి ఏడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని..ఇలాంటి వారి కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

సివిల్స్ పరీక్షల అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించి, మెరిట్ లిస్టులో పేరు రాని అభ్యర్థుల వివరాలను ఇకపై ప్రత్యేక పోర్టల్‌లో ఉంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ వివరాలను ప్రైవేట్ సంస్థలు తీసుకొని, తమ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదల పరిస్థితులపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నాయని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలకు, భద్రతా దళాలకు, సామాజిక కార్యకర్తలకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

జమ్మూ కశ్మీర్ కూడా ప్రకృతి వైపరీత్యాల ధాటికి లోనవుతున్నప్పటికీ, అనేక రంగాల్లో ముందుకు వెళ్తోందని మోదీ పేర్కొన్నారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో నిర్వహించిన ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ను ప్రస్తావిస్తూ, దేశం నలుమూలల నుండి 800 మందికిపైగా అథ్లెట్లు పాల్గొన్నారని, పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా తమ ప్రతిభను చాటారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కశ్మీర్‌లోని పుల్వామాలో తొలిసారిగా డే-నైట్ క్రికెట్ మ్యాచ్‌ నిర్వహించబడిందని, ఇది దేశం మార్పు వైపు పయనిస్తున్నదానికి నిలువెత్తు ఉదాహరణ అని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :