• రూ.700 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
జనం పవర్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పరిష్కారంలో కీలక అడుగు వేసింది. శనివారం ఏకంగా రూ.700 కోట్ల నిధులను విడుదల చేసి, ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. వీటిలోగత 20 నెలలుగా పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ వేతన బిల్లులకు రూ.392 కోట్లనుప్రత్యేకంగా కేటాయించింది. ప్రతి నెలా జీతభత్యాల బిల్లులు ఖజానా శాఖకు సమర్పించడం సాధారణం. అయితే, గతంలో కొన్ని సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థికశాఖ తాజాగా వాటిలో కొంత మొత్తాన్ని విడుదల చేసినప్పటికీ, ఇంకా సుమారు రూ.1,900 కోట్ల సప్లిమెం టరీ బిల్లులు చెల్లించాల్సి ఉంది. జూన్‌లో కేబినెట్ నిర్ణయం ప్రకారం, ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ వాగ్దానంలో భాగంగానే ఈ నెలకు సంబంధించిన నిధులను శనివారం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో, సప్లిమెం టరీ బిల్లులతో పాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బిల్లులకూ రూ.308 కోట్లను చెల్లించినట్లు ఐకాస నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. అయితే, ఇంకా ఉద్యోగుల బిల్లులకు రూ.10వేల కోట్ల వరకు రావాల్సి ఉందని వారు గుర్తుచేశారు.ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పరిష్కారంకోసం ప్రభుత్వం దశలవారీ చర్యలు చేపడుతుండగా, ఉద్యోగ వర్గాలు మాత్రం పూర్తి మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.









