జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31:
దేశానికి వెలుతురు ప్రసరింప జేసేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలందించిన
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, వంగ వెంకట్ ఆదివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ ప్రదమైన జీవితం కొనసాగాలంటే ఆర్థిక భద్రత వైద్య సౌకర్యాలు అవసరమని ఇట్టి అవసరాలు తీర్చేందుకు బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం 27 సంవత్సరాల క్రితం కనీస పెన్షన్ రూ.350 నిర్ణయించారని నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యం లేని పెన్షన్ పెరగకపోవడం వలన దేశ వ్యాప్తంగా ఐదు లక్షల పెన్షన్‌దారులు దారిద్ర్య రేఖ దిగువున జీవిస్తున్నారని తెలిపారు. ఎన్నో సార్లు పెన్షన్ పెంచాలని మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని కేంద్ర మంత్రులకు రాజకీయ నేతలకు వినతులు సమర్పించామని ఆశాజనక చర్యలు ప్రభుత్వాలు చేపట్టడం లేదని వివరించారు. పార్లమెంట్ ప్రతిపాదించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులను కూడా అమలు పరచడం లేదని పేర్కొన్నారు. 2007కు ముందు రిటైర్ కాబడిన వారికి పెన్షన్ పెంచాలని వినియోగదారుల ధర సూచికను బట్టి కరువు భత్యంతో అనుసాధించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి పెన్షన్ సవరణ జరపాలని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రద్దు చేసి బొగ్గు మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ, కోల్ ఇండియా, సింగరేణి, పెన్షన్ ఫండ్ రెగ్యులేరిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో కోల్ పెన్షన్ ఫండ్ కేటాయించాలని కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని విశ్రాంత ఉద్యోగులకు అధికారులకు ఒకే రకమైన వైద్య విధానం అమలు పరచాలని కోరారు. మెడికల్ బిల్స్ లో రియంబర్స్మెంట్ చెల్లింపులో జాప్యం నివారించాలని సవరించిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల జారీలో జాప్యం నివారించాలని తదితర డిమాండ్లు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 15న కోల్ ఇండియా హెడ్డాఫీస్ ముందు కలకత్తాలో భారీ ప్రదర్శన నిర్వహించాలని ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు పేరుకు కోల్ ఇండియా సింగరేణి విశ్రాంత ఉద్యోగులు సిద్ధమవుతున్నారని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, వంగ వెంకట్ తెలిపారు.









