జనం పవర్, వనపర్తి, ఆగష్టు 31 :
పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. పదేపదే ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ పారిశుధ్య కార్యక్రమాలు చేపడు తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అధికారులు నిత్యం ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఓవైపు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మరోవైపు ఇంకుడు గుంతల తవ్వకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లా వ్యాప్తంగా బహిరంగ మూత్రశాలలు, మరుగుదొడ్లు ఒక్క చోట కూడా లేవు. దీంతో ప్రజలు పడుతున్న పాట్లు ఇంతా అంతా కాదు. వనపర్తిలో ప్రభుత్వం నియోజకవర్గాల్లోని జనాభాను, ఇతర అంశాలను ఆధారం చేసుకొని వనపర్తిని జిల్లాగా మార్చింది. దీంతో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు విస్తరిస్తాయని ప్రజలు ఆశించారు. కానీ, ఆశలు అడియాశలు అవుతున్నాయని రోజులు గడిచే కొద్ది ప్రజలకు అర్థమౌతుందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం వివిధ రంగాల్లో దినదిన అభివృద్ధి చెందుతుంది. కి.మీ.కొద్ది నూతన కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. అయినా కూడా మౌలిక సదుపాయాల కల్పన కలగానే మిగిలింది.
పలు ప్రభుత్వ కార్యాలయాల్లో
నిత్యం వివిధ పనులపై పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అక్కడక్కడ సంతరోజుల్లో వేలాది మంది రాకపోకలతో కళకళ లాడుతుంటాయి. పలు విద్యా సంస్థలు, విద్యార్థుల రాకపోకలు ప్రతీరోజు జరుగుతున్నాయి. కనీసం ఒక్క చోట కూడా బహిరంగ మరుగు దొడ్డి లేకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక ఇళ్ల మధ్య, విద్యుత్ నియంత్రికల వద్ద, ముళ్ల పొదలు, పాడుబడ్డ పరిసరాల్లో చాటుగా మూత్రవిసర్జన చేస్తున్నారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాలు కలుషితం కావడంతో పాటు దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్న మాటలు, చేతలకు ఎలాంటి పొంతన లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజలు రద్దీగా ఉండే చోట మున్సిపాలిటీ శౌచాలయాలు (మరుగుదొడ్లు ) ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న పట్టణీకరణతో మరుగుదొడ్లు ఏర్పాటు అత్యవసరమైంది. గతంలో పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. గాంధీచౌక్లో గతంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండేవి. రహదారుల విస్తరణ పనుల్లో తొలగించారు. గాంధీచౌక్ తో పాటు
మిగిలిన ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ సుమారు 6-7 మూత్రశాలలు, మరుగుదొడ్లు అవసరం ఉండగా కేవలం నాలుగు మాత్రమే నిర్మించారు. పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉంది. మరో 20- 30 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చి పోతుంటారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక సమూహం, కిలోమీటరు దూరం ఉన్న ప్రాంతాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అధికారులు తగిన చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. పట్టణంలోని జమ్మి చెట్టు, గాంధీ చౌక్, పానగల్ రోడ్డు, బసవన్న గడ్డ, ఆర్డీవో కార్యాలయం, మర్రికుంట దగ్గర ఏర్పాటు చేయాలి ప్రజలు కోరుతున్నారు. గాంధీ చౌక్ ప్రాంతంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఒంటికి, రెంటికి సుమారు కిలోమీటరు దూరం వెళ్లాల్సి వస్తోంది. అవసరమైన చోట వీటిని ఏర్పాటు చేయాలి. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం సంత రోజు అత్యధికంగా ప్రజలు గాంధీచౌక్ ప్రాంతానికి వస్తుంటారు.ఇక్కడ ఎలాంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు.,వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరుగుదొడ్లు మూత్రశాలలు లేక ఇబ్బందులు
వనపర్తి జిల్లా కేంద్రంలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు ఒంటికి,రెంటీకి వెళ్లాలంటే సుమారు కిలోమీటర్ దూరం లేదా ఇంటికి వెళ్లాలి. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రారంభించాలి.—-వజ్రాల రమేష్ వనపర్తి.
గాంధీచౌక్లో గతంలో మరుగుదొడ్లు ఉండేవి రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని తొలగించారు. అధికారులు పున:ప్రారంభించాలి. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతం నాగవరం రోడ్డులో, మరికుంట, జమ్మి చెట్టు దగ్గర మరుగుదొడ్లను మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.—దయనంద్ ముదిరాజ్ వనపర్తి.









