రైతు డిక్లరేషన్‌ పేరుతో నట్టేట ముంచిండ్లు… రైతుల ఓట్లతోనే మంత్రి పదవి వచ్చిందని గుర్తించాలే. వరి..పత్తి పంటల నష్టంపై వెంటనే సర్వే చేయించాలి. ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం అందించాలే — మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్‌

 

మంథని – జనం పవర్ ఆగష్టు (31)

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందు పంటలకు ఇన్సూరెన్స్‌ చేయిస్తామని,మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు డిక్లరేషన్‌ పేరుతో నట్టేట ముంచారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. ఆదివారం మంథని మండలం పోతారం, విలోచరం గ్రామాల్లో గోదావరి నది వరద ఉదృతికి మునిగిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు.ఆయా గ్రామాల్లోని రైతులు సాగు చేసిన పంటలన్నీ వరదపాలు అయ్యాయని మాజీ ఎమ్మెల్యేకు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది వరద ఉదృతికి విలోచవరం,పోతారం గ్రామాల్లోని పంట పొలాల్లో ఐదు రోజులుగా నీళ్లు నిలిచి ఉన్నాయన్నారు. వందల ఎకరాల్లో పత్తి పంట మాడిపోగా,వందల ఎకరాల్లో వరి పంట నీటిలో మునిగిపోయిందన్నారు. అయితే నీళ్లు తగ్గితే వరి పంటకు ఏమీ కాదని రైతులను అడిగితే ఇప్పటికే వరి పొలాలన్నీ మురుగు వాసన వస్తున్నాయని,పంట పూర్తిగా కుళ్లపోతుందని చెప్పారన్నారు. గోదావరినది వరద నీళ్లు వేడిగా ఉండి పంటలన్ని ఉడికినట్లు అవుతాయని అధికారులకంటే రైతులే గొప్ప సైంటిస్టుల్లా చెప్పారన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గత ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదన్నారు.ఈ ప్రాంత ప్రజలు,రైతుల ఓట్లతో ఇంత పెద్ద పదవి పొంది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉండే మంథని ఎమ్మెల్యేకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత లేదానని ప్రశ్నించారు.మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా ఓట్ల కోసం రైతులను నమ్మించారని,రైతులకు బోనస్‌ ఇస్తామని,పంట నష్టపరిహారం చెల్లిస్తామని, పంటలకు ఇన్సూరెన్స్‌ చేస్తామని,డిక్లరేషన్‌లో ప్రకటించిన మంథని ఎమ్మెల్యే ఈ రైతులకు ఏం చేశాడని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుందన్నారు. ప్రజలు,రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే పోలీసులతో అణిచివేయాలని భయబ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదని, ఆనాడు ఒక్కడిగా బయటకు వచ్చినప్పుడే ఎవరికి భయపడలేదన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టకుండా ప్రజల పక్షాన తాము విన్నవించే వాస్తవ విషయాలను గ్రహించాలని ఆయన హితవు పలికారు. గోదావరివరదలో మునిగిపోయిన పంటలను వెంటనే సర్వే చేయించి నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.నే టికైనా మంథని ఎమ్మెల్యే రైతుల గురించి ఆలోచన చేసి ప్రాజెక్టుల గేట్లు దించి భూగర్బజలాలు పెరిగే విధంగా ఈ ప్రాంతంలోని ముదిరాజ్‌లు,రైతులకు మత్స్య సంపదతో ఉపాధి పెరిగేలా చూడాలన్నారు. ఈ మట్టిపై పుట్టిన బిడ్డగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :