శ్రమ దోపిడీలో కాంట్రాక్ట్ కార్మికులు * వేతనం తక్కువ పని భారం ఎక్కువ * సంక్షేమాన్ని విస్మరిస్తున్న యాజమాన్యం * కనీస వేతనం నెలకు 25 వేలు ఇవ్వాలి * బిఎంఎస్ ప్రధాన నాయకుల డిమాండ్

జనం పవర్, భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31:
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడీకి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ అభిప్రాయపడింది. కొత్తగూడెం బీఎంఎస్ భవనంలో ఆదివారం సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ కార్యకర్తల సమావేశం కార్పొరేట్ ఏరియా కార్యదర్శి రాకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎబికెఎంఎస్ కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు పి.మాధవ నాయక్, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యులు
టిఎస్.పవన్ కుమార్, కార్పొరేట్ ఏరియా ఉపాధ్యక్షులు జివి.కృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల సవరణ జరగకపోవడం వలన సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమదోపిడీకి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతన సవరణ చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కనీస వేతన చట్టంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని తక్షణమే సవరించి కాంట్రాక్ట్ కార్మికులకు తగిన జీతభత్యాలు బోనస్ వైద్య సౌకర్యాలు పెన్షన్ తదితర హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల ప్రకారం రోజువారీ 1283 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో మాత్రం కేవలం 580 రూపాయలు మాత్రమే చెల్లించడం అత్యంత అన్యాయమని అన్నారు. కనీసం 25 వేల నెలవారీ జీతం ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బోనస్ వైద్య సదుపాయాలు నివాస క్వార్టర్లు సౌకర్యం సామాజిక భద్రత వంటి హక్కులు కూడా తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 12న సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరగబోయే మహాధర్నాను జయప్రదం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షురాలు తోటి నిర్మల, ప్రధాన కార్యదర్శి ఇనుపనూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :